Private Bus Accident: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు కిందకి దిగడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి కందుకూరుకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విహారీ ట్రావెల్స్‌కి (Vihari Travells) చెందిన బస్సుచిట్యాల మండలం పిట్టంపల్లి వద్దకు రాగానే బస్సులో పొగలు వ్యాపించాయి. దీంతో బస్సును నిలిపివేసిన సిబ్బంది.. ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో వారంతా కిందికి దిగిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.