Delhi Explosion: ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు.. 10 మంది మృతి

admin
By admin
77 Views
2 Min Read

Delhi Explosion: దేశ రాజధాని దిల్లీలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట సమీపంలో సాయంత్రం సరిగ్గా 6.52గంటల సమయంలో ట్రాఫిక్‌ రెడ్‌లైట్‌ వద్దకు నెమ్మదిగా సమీపిస్తున్న ఓ కారులో పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా.. 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ప్రమాదం అనంతరం ఏడు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. దిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా క్లూస్‌ టీమ్‌, ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీ బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

భీతావహ వాతావరణం:
భారీ పేలుడు (Delhi Explosion)తో ఘటనా స్థలంలో భీతావహ వాతావరణం నెలకొంది. పేలుడు ధాటికి చుట్టుపక్కలే ఉన్న పలు కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆరు కార్లు, రెండు ఇ-రిక్షాలు, ఒక ఆటో రిక్షా మంటల్లో కాలి బూడిదయ్యాయి. కారులో ఉంచిన పేలుడు పదార్థాలను దూరం నుంచి ఎవరైనా రిమోట్‌ కంట్రోల్‌ సాయంతో పేల్చి ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ప్రతి సోమవారం దిల్లీలోని పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకు సెలవు కావడంతో ప్రమాదం తీవ్రత తక్కువగా ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ‘‘ఈ పేలుడు జరిగినప్పుడు నేను గురుద్వారా వద్ద ఉన్నాను. భారీ శబ్దం వినిపించింది. అదేంటో మాకు అర్థంకాలేదు. అంత పెద్దగా వినిపించింది. ఆ వాహనానికి సమీపంలో ఉన్న మరికొన్ని వాహనాలూ పూర్తిగా దగ్ధమయ్యాయి’’ అని ఓ ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు.

దిల్లీ సహా సరిహద్దు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం:
పేలుడు నేపథ్యంలో దిల్లీ సహా పలు నగరాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఈ ఉదయం భారీగా పేలుడు (Delhi Explosion)సామగ్రి పట్టుబడటం.. సాయంత్రమే దిల్లీలోని ఎర్రకోట సమీపంలోని కారులో భారీ పేలుడు ఘటన నేపథ్యంలో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దిల్లీ, హరియాణా, యూపీలను కలిపే అన్ని సరిహద్దు పాయింట్ల వద్ద పోలీసు నిఘాను పెంచారు. రైల్వే స్టేషన్లు, మెట్రోస్టేషన్లు వంటి సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పెంచారు. స్పెషల్‌ సెల్‌, క్రైం బ్రాంచ్‌ సహా అన్ని విభాగాలను అప్రమత్తం చేసినట్లు అధికారులు వెల్లడించారు. దిల్లీ- హరియాణా సరిహద్దు సమీపంలో వాహనాలు, లాడ్జీలను తనిఖీ చేయాలని బృందాలను ఆదేశించినట్లు తెలిపారు. ముఖ్యంగా సింఘు, టిక్రీ, బదర్‌పుర్‌ సరిహద్దుల వద్ద అదనపు పికెట్‌లను ఏర్పాటు చేసి గస్తీని ముమ్మరం చేశారు.

Share This Article
Leave a Comment