Home Center Govt Schemes ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) అంటే ఏమిటి? ఎవరు తప్పకుండా పంట బీమా...

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) అంటే ఏమిటి? ఎవరు తప్పకుండా పంట బీమా చేయించుకోవాలి? పూర్తి సమాచారం తెలుసుకుని పంట పరిహారం పొందండి.

PMFBY 2026

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) అంటే ఏమిటి?

వ్యవసాయం అంటే లాభాలే కాదు… ప్రతి సీజన్‌లో ఒక రిస్క్ కూడా ఉంటుంది. ఒకసారి వర్షం ఎక్కువ పడితే పంట నష్టం… మరోసారి వర్షాలు లేకపోతే పంట ఎండిపోవడం… కొన్ని సార్లు తెగుళ్లు… మరికొన్ని సార్లు తుఫానులు… ఇలాంటి పరిస్థితుల్లో రైతు పెట్టిన పెట్టుబడి మొత్తం ఒక్కసారిగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.

ఇలాంటి ఆర్థిక నష్టాల నుంచి రైతులకు కొంత భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పంట బీమా పథకమే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (Pradhan Mantri Fasal Bima Yojana – PMFBY). ఈ పథకం 2016లో ప్రారంభమైంది మరియు ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలు అవుతోంది.

ఈ పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి?

చాలా మంది రైతులు ఒక అపోహలో ఉంటారు. “పంట దెబ్బతింటే ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది” అని అనుకుంటారు. వాస్తవానికి PMFBY ఉద్దేశ్యం కేవలం నష్టపరిహారం ఇవ్వడం మాత్రమే కాదు.

  • ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతు పెట్టుబడి పూర్తిగా నష్టపోకుండా రక్షించడం.
  • రైతు ఆదాయానికి కొంత భద్రత కల్పించడం.
  • వ్యవసాయం కొనసాగించే ధైర్యం రైతులో పెంచడం.
  • రైతులు ఆధునిక సాగు పద్ధతులు అవలంబించేందుకు ప్రోత్సహించడం.
  • వ్యవసాయ రుణ వ్యవస్థపై విశ్వాసం పెంచడం.

రైతు ఎందుకు పంట బీమా చేయించుకోవాలి?

ఉదాహరణకి ఒక రైతు 3 ఎకరాల్లో వరి సాగు చేశాడని అనుకుందాం. అతను విత్తనాలు, ఎరువులు, మందులు, కూలీల కోసం చాలా వరకు ఖర్చు చేశాడు. పంట కోతకు వారం ముందు తుఫాను వచ్చి మొత్తం పంట నేలకొరిగింది. ఇలాంటి సమయంలో పంట బీమా లేకపోతే నష్టం మొత్తం రైతే భరించాలి. కానీ పంట బీమా ఉంటే, పథకం నిబంధనలకు అనుగుణంగా పరిహారం పొందే అవకాశం ఉంటుంది. పరిహారం మొత్తం ప్రతి కేసులో ఒకేలా ఉండదు, అది జిల్లా, పంట, బీమా మొత్తం, దిగుబడి అంచనా మరియు అధికారిక లెక్కలపై ఆధారపడి నిర్ణయించబడుతుంది.

PMFBYలో రైతుకు కలిగే ప్రధాన ప్రయోజనాలు

  • ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే బీమా రక్షణ.
  • రైతు మొత్తం ప్రీమియం కాకుండా, ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే కారణంగా తక్కువ ప్రీమియంతో బీమా పొందే అవకాశం.
  • వరదలు, కరువు, తుఫానులు, వడగళ్ల వాన, కొన్ని రకాల తెగుళ్లు, వ్యాధులు వంటి నిబంధనల్లో పేర్కొన్న ప్రమాదాలకు రక్షణ.
  • పంట కోత అనంతరం నిర్దిష్ట పరిస్థితుల్లో కూడా పరిమిత కాలానికి రక్షణ లభించే అవకాశం.
  • కొన్ని రాష్ట్రాల్లో, రాష్ట్ర నిర్ణయం మేరకు అడవి జంతువుల దాడి వల్ల కలిగే నష్టాన్ని అదనపు కవరేజ్‌గా చేర్చే అవకాశం.

రైతు ఎంత ప్రీమియం చెల్లించాలి?

చాలా మంది రైతులు ఒక అపోహలో ఉంటారు. “బీమా చేయించుకోవాలంటే వేల రూపాయలు చెల్లించాలి” అని, అది నిజం కాదు.

PMFBYలో సాధారణంగా రైతు వాటా:

  • ఖరీఫ్ పంటలకు – బీమా మొత్తంలో 0.2% నుండి 2% వరకు
  • రబీ పంటలకు – 1.5% వరకు
  • వాణిజ్య / ఉద్యాన పంటలకు – 5% వరకు

మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీగా భరిస్తాయి. అయితే తుది ప్రీమియం, బీమా మొత్తం మరియు పంట వివరాలు రాష్ట్ర నోటిఫికేషన్‌పై ఆధారపడి ఉంటాయి.

పంట బీమా చేయించుకోవాలంటే ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి

చాలామంది రైతులు ఇలా అనుకుంటారు. “నా దగ్గర పట్టాదారు పాస్‌బుక్ ఉంది… కాబట్టి నాకు ఖచ్చితంగా బీమా వస్తుంది.” ఇది పూర్తిగా నిజం కాదు. మరికొందరు ఇలా అనుకుంటాడు. “నేను కౌలు రైతిని… నాకు అసలు పంట బీమా రాదు.” ఇది కూడా ప్రతి సందర్భంలో నిజం కాదు.

PMFBYలో బీమా రావాలంటే భూమి యజమాని కావడం ఒక్కటే ప్రమాణం కాదు. ప్రధానంగా ప్రభుత్వం చూసేది మూడు విషయాలు:

  • మీరు నిజంగా పంట సాగు చేస్తున్నారా?
  • మీరు సాగు చేసిన పంట ఆ సీజన్‌కు నోటిఫై చేసిన పంటేనా?
  • మీ గ్రామం/ప్రాంతం ఆ పంటకు నోటిఫై అయిందా?

ఈ మూడు సరిపోతేనే బీమా పొందే అవకాశం ఉంటుంది.

PMFBYలో ఎవరు అర్హులు?

ఈ కింది రైతులు అర్హులు:

1. స్వంత భూమిలో సాగు చేసే రైతులు

ఇది అత్యంత సాధారణ category. పట్టాదారు పాస్‌బుక్ ఉన్న రైతు తన భూమిలో ప్రభుత్వం నోటిఫై చేసిన పంటను సాగు చేస్తే, ఇతర నిబంధనలు నెరవేరినట్లయితే పంట బీమా పొందవచ్చు.

2. కౌలు రైతులు

చాలామంది అడిగే ప్రశ్న ఇదే. “కౌలు రైతులకు బీమా వస్తుందా?” అవును. కౌలు రైతి అని ప్రభుత్వం ఇచ్చే కౌలు రైతు సర్టిఫికేట్ ఉండాలి.

3. భాగస్వామ్య రైతులు (Sharecroppers)

కొన్ని ప్రాంతాల్లో పంటను వాటాల పద్ధతిలో సాగు చేస్తారు. అలాంటి రైతులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన ఆధారాలతో, సంబంధిత నిబంధనలు పాటిస్తే అర్హులు అవుతారు.

రైతులు భీమా ఎక్కడ చేయించుకోవాలి?

  • CSC (కామన్ సర్వీస్ సెంటర్)
  • గుర్తింపు పొందిన బ్యాంకులలో చేయించుకోవాలి.
Previous articleBest Term Insurance India 2026: భారతదేశంలో బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏది? పూర్తి తెలుగు గైడ్
Next articleఅనంత పద్మనాభ స్వామి ఘాట్ రోడ్డుపై మరో ప్రమాదం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here